Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 59

Story of Trisanku - 2 !!

|| om tat sat ||

ఉక్త వాక్యం తు రాజానం కృపయా కుశికాత్మజ |
అబ్రవీన్మధురం వాక్యం సాక్షాత్ చండాలరూపిణమ్ ||

తా|| చండాలరూపములోగల ఆ రాజుయొక్క మాటలను విని కరుణతో మథురమైన వాక్యములతో ఇట్లు చెప్పెను

బాలకాండ
ఏబది తొమ్మిదవ సర్గము

శతానందుడు విశ్వామిత్రుని కథ చెప్పసాగెను.

’'చండాలరూపములోగల ఆ రాజుయొక్క మాటలను విని కరుణతో మథురమైన వాక్యములతో విశ్వామిత్రుడు ఇట్లు చెప్పెను. " ఓ ఇక్ష్వాకా ! వత్సా స్వాగతము. భయపడకుము| నీ ధార్మికత్వము నాకు తెలుసు. ఓ నృపపుంగవ నీకు శరణు ఇచ్చుచున్నాను . ఓ రాజన్ ! యజ్ఞమున సహాయపడు పుణ్యాత్ములైన మహర్షులనందరినీ ఆహ్వానింతును. అప్పుడు నీవు నిశ్చింతగా యజ్ఞము చేయుము. నీకు గురుశాపమువలన కలిగిన చండాలరూపము ఇట్లేయున్నచే అటులనే శరీరముతో సహా ( స్వర్గమునకు) వెళ్ళెదవు. నీవు శరణు ఇవ్వగల కౌశికుని శరణులోకి వచ్చితివి కనుక నేను నీకు స్వర్గము హస్తగతము అయినట్లే భావింతును'.

ఆ మహాతేజోవంతుడు ఇట్లు పలికి పరమ ధార్మికులూ ప్రజ్ఞావంతులూ అయిన తన పుత్రులకి యజ్ఞము నకు కావలసిన సంభారములను సమకూర్చుటకు ఆదేశము ఇచ్చెను.

తన శిష్యులను అందరినీ పిలిచి ఇట్లు చెప్పెను. "వత్సా ! ఋషిగణములను అందరినీ శిష్యులతో , మిత్రులతో, ఋత్విజులతో , అన్నీ వేదములు తెలిసిన పండితులతో నా ఆజ్ఞ గా తీసుకు రండు. ఏవరైన నా మాటలు అనుసరించక ఇతర మాటలను చెప్పినచో అది అంతయూ నాకు తెల్పుడు" అని.

విశ్వామిత్రుని మాటలను విని ఆ ఆజ్ఞతో శిష్యులు అన్ని దిశలలో పోయిరి. పిమ్మట దేశ దేశములనుంచి బ్రహ్మవాదులు అందరు వచ్చిరి. ఆయన శిష్యులు అందరూ తేజముతో వర్ధిల్లుచున్న ఆ మునివద్దకు వచ్చి బ్రహ్మవేత్తలు పలికిన మాటలు ఆయనకు వినిపించిరి. "మీ మాటలను అనుసరించి మహోదయుడు తప్ప దేశ దేశములనుండి బ్రాహ్మణులందరు వచ్చుచున్నారు. ఓ మునిపుంగవ ! ఆ వందమంది వసిష్ఠుని పుత్రులు ఏమని చెప్పితిరో అది సర్వము నీవు వినుము".

’'చండాలునియొక్క యజ్ఞము క్షత్రియునిచే చేయబడుచున్నది. ఆ సదస్సులో దేవతలూ ఋషులు ఏట్లు భుజించెదరు ? విశ్వామిత్రునిచే పాలింపబడి ఆ చండాలుని భోజనము తిని బ్రాహ్మణులైననూ మహాత్ములే అయిననూ స్వర్గము ఏట్లు చేరెదరు?' అని. ఓ ముని శార్దూల ! ఈ విథముగా మహోదయుడూ వసిష్ఠుని పుత్రులందరూ క్రోధముతో ఎర్రపడిన కన్నులతో నిష్టూరముగా మాట్లాడిరి".

ఆ మాటలను విని విశ్వామిత్రుడు క్రోధముతో నిండిన కన్నులు గలవాడై ఇట్లు పలికెను : "తీవ్రముగా తపమోనర్చుచూ, పవిత్రముగా నున్న నన్ను దూషించుచున్నారు. వీరు భస్మము అయిపోయెదరు. సందేహము లేదు . నేడే వారు యమపాశముతో నరకమునకు లాగబడుదురు. వీరందరూ ఏడు వందల సంవత్సరములు మృత బక్షకులుగా నుందురు. వారు శవములను భక్షించుచూ ఉండెదరు. వారు వికృతరూపులై ముష్టికా అనబడుచూ లోకమున సంచరించెదరు. దుర్బుద్ధిగల మహోదయుడు నన్ను దూషించెను . అతడు అన్ని లోకములలో దూషించబడుచూ కిరాతకుని వలె వుండును. దీర్ఘకాలము నా శాపము వలన ప్రాణులను హింసించుచూ కఠినాత్ముడై దుర్గతులు పొందును" అని.

ఇట్టి వచనములను ఆ ఋషుల మధ్యలో చెప్పి మహాముని అయిన విశ్వామిత్రుడు మిన్నకుండెను.

ఈ విథముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో బాలకాండలో ఎబది తొమ్మిదవ సర్గము సమాప్తము

||ఓమ్ తత్ సత్ ||

ఏతావదుక్త్వా వచనం విశ్వామిత్రో మహతపాః |
విరరామ మహాతేజా ఋషిమధ్యే మహామునిః ||

"ఇట్టి వచనములను ఆ ఋషుల మధ్యలో చెప్పి మహాముని అయిన విశ్వామిత్రుడు మిన్నకుండెను".

|| ఓమ్ తత్ సత్ ||